NASA Europa Clipper Mission Explained in Telugu | నాసా జ్యూపిటర్ చందమామను ఎందుకు టార్గెట్ చేసింది.?
నాసా మరో భారీ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. భారత కాలమానం ప్రకారం రేపు రాత్రి 9 గంటల 40 నిమిషాలకు నాసా స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ అనే పెద్ద రాకెట్ ద్వారా యూరోపా క్లిప్పర్ అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెడుతోంది. మన సౌర కుటుంబంలోనే అతిపెద్ద గ్రహమైన జ్యూపిటర్ కి ఉన్న 95 చందమామల్లో ఒక చందమామైన యూరోపా ను టార్గెట్ చేసి నాసా ఈ ప్రయోగం చేయటానికి కారణం ఏంటీ..అసలు ఈ మిషన్ కోసం నాసా ఎంత ఖర్చు పెడుతోంది..ఈ వీడియోలో తెలుసుకుందాం.
యూరోపా అనేది బృహస్పతి కి ఉన్న 95 చందమామల్లో ఒకటి. మన భూమికి ఎలా అయితే చంద్రుడు సహజమైన ఉపగ్రహమో అలానే బృహస్పతి లాంటి పెద్ద గ్రహానికి 95 చందమామలు ఉన్నాయి. వాటిలో ఒకటే ఈ యూరోపా. ఈ చందమామ ఆచూకీ తెలుసుకునేందుకు అసలు అక్కడి ఉపరితలంపై ఎలాంటి పరిస్థితులున్నాయి తెలుసుకునేందుకు యూరోపా క్లిప్పర్ పేరుతో ఈ శాటిలైట్ ను పంపిస్తోంది నాసా. ఇప్పటివరకూ నాసా ప్రయోగించిన శాటిలైట్స్ లో అన్నింటిలో ఇదే అతి పెద్దది. దాదాపు వంద అడుగులు ఉంటుంది దీని పరిమాణం. అంటే ఓ బాస్కెట్ బాల్ కోర్టు ఎంత ఉంటుందో అంత ఉంటుంది. మొత్తం బరువు 6వేల కిలోలు ఉంటుంది. ఉన్నబరువులో సగం ఇంధనానిదే.
యూరోపా ను పరిశీలించటానికి జ్యూపిటర్ కక్ష్యలోకి చేరుకోవటానికి క్లిప్పర్ మిషన్ ఏకంగా 290 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించాలి. అది కూడా 6వేల కిలోల బరువైన ఈ ఉపగ్రహంలో సగం బరువు ఇంధనమే ఉంటుంది కానీ అది నేరుగా బృహస్పతి దగ్గరికి వెళ్లటానికి సరిపోదు. అందుకే స్లింగ్ షాట్ పద్ధతిని ఎంచుకున్నారు సైంటిస్టులు. అంటే భూమి నుంచి బయల్దేరిని యూరోపా క్లిప్పర్ మార్స్ కక్ష్యలోకి వెళ్లి దాని గ్రావిటీనీ వాడుకుంటూ దాని చుట్టూ తిరిగి భూమి కక్ష్యలోకి వస్తుంది. తిరిగి భూమి గ్రావిటీని వాడుకుని ఈ సారి నేరుగా బృహస్పతి దిశగా ప్రయాణం మొదలుపెడుతుంది. ఈ టెక్నిక్ నే స్లింగ్ షాట్ అంటారు సైంటిస్టులు. పొలాల్లో రైతులు పక్షులను తోలటానికి వడిశెల లో రాయి పెట్టి తిప్పి తిప్పి పక్షులకు తగిలేలా విసురుతారు కదా సేమ్ టెక్నిక్ ను వాడతారు.