Explosion Near Karachi Airport | కరాచీ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఆత్మాహుతి దాడి | ABP Desam
పాకిస్థాన్‌లోని కరాచీలో ఆత్మాహుతి దాడి జరిగింది. జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద బాంబు ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించింది. ఫలితంగా...స్థానికులంతా ఉలిక్కిపడ్డారు. ఈ దాడిలో చైనాకి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్ లోకల్ టైమ్ ప్రకారం..అక్టోబర్ 6వ తేదీ రాత్రి 11 గంటలకు ఈ దాడి జరిగింది. టెర్రరిస్ట్ గ్రూప్ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు ప్రకటించింది. చైనా ఇంజనీర్లు, ఇన్వెస్టర్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్టు వెల్లడించింది. ఈ దాడి ధాటికి చుట్టు పక్కల పొగ కమ్ముకుంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
ఈ ఘటనలో గాయపడ్డ వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. గతేడాది మార్చిలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫంక్తువా ప్రావిన్స్‌లో చైనా పౌరులను టార్గెట్‌గా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు చైనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. చైనా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు..ఇలా దాడులకు పాల్పడుతున్నారు.