అయోధ్య ఉత్సవంలోనూ అపచారం, రామయ్య వేడుకల్లో తిరుమల లడ్డూలు
తిరుమల లడ్డు వివాదం దేశవ్యాప్తంగా సంచలనమవుతోంది. లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. అయితే...ఈ ఏడాది జనవరిలో జరిగిన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి తిరుమల నుంచి లక్ష లడ్డూలు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికారికంగా ప్రకటించారు. అయోధ్య ఉత్సవంలో ఈ తిరుమల లడ్డూలనే భక్తులకు పంచిపెట్టారు. ఇదే ఇప్పుడు మరో సంచలనమవుతోంది. అపచారం జరిగిపోయిందన్న కలవరం ఇప్పటికే అయోధ్యలో మొదలైంది. ఈ వివాదంపై అయోధ్య రామ మందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తీవ్రంగా స్పందించారు. ఎన్ని లడ్డూలు తెప్పించారో కచ్చితంగా తెలియదని, ఆ లెక్కలన్నీ ట్రస్ట్ వద్దే ఉంటాయని స్పష్టం చేశారు. లడ్డూల కల్తీ వెనక కచ్చితంగా ఏదో కుట్ర ఉందని,పూర్తి స్థాయిలో విచారణ జరిపించి తీరాలని సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు. ఈ ఏడాది జనవరి 22న అయోధ్య రామ మందిర నిర్మాణ ప్రారంభోత్సవం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ రామ్ లల్లాకి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. శ్రీరామ జనమ్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్...ఈ వేడుకల నిర్వహణ బాధ్యత చూసుకుంది. ఉన్నట్టుండి ఈ వివాదం తెరపైకి రావడం వల్ల...కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ జరిపించాలని ట్రస్ట్ కోరుతోంది.