Kabul Airport: కాబుల్ ఎయిర్ పోర్టులో కిక్కిరిసిన ప్రయాణికులు... ఎయిర్ పోర్టులో తొక్కిసలాట
అఫ్గాన్ రాజధాని కాబుల్‌ను తాలిబన్లు సమీపించారని తెలిసిన వెంటనే నగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విమానాశ్రయాల వైపు పరుగులు తీశారు. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు వివిధ రాష్ట్రాల రాజధానులను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో చాలా మంది దేశ రాజధాని కాబుల్‌కు వలసవచ్చారు. ఇక్కడ ప్రభుత్వ బలగాలు అధిక సంఖ్యలో ఉండటంతో తాలిబన్లను అడ్డకుంటారని భావించారు. కానీ ఊహించిన దాని కంటే బలంగా తాలిబన్లు కాబుల్ వైపు దూసుకొచ్చారు. రాజధానిని వశం చేసుకున్నారు. దీంతో ప్రజలు ప్రాణ భయంతో విమానాశ్రయాల వైపు పరుగుల తీస్తున్నారు.
అఫ్గానిస్థాన్‌లోని కాబూల్ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్లు అఫ్గాన్ చేజిక్కించుకోవడంతో వేలాది మంది దేశాన్ని విడిచివెళ్లేందుకు విమానాశ్రయానికి వస్తున్నారు. పౌరులు భారీగా వస్తుండడంతో భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు కూడా జరిపాయి. విమానాశ్రయంలో తొక్కిసలాట జరిగింది. ఐదుగురు పౌరులు చనిపోయినట్లు తెలుస్తోంది.