T20 Cricket New rules: టీ-20 సిరీసుల్లో కొత్త రూల్ ఏంటో తెలుసా?..
ఇకపై టీ20ల్లో స్లో ఓవర్ రేట్ నమోదైతే కఠిన పెనాల్టీ విధించేందుకు ఐసీసీ సరికొత్త నియమ నిబంధనలను తీసుకొచ్చింది. నిర్దేశిత సమయానికి అనుగుణంగా బౌలింగ్ టీం ఓవర్లు వేయలేకపోతే... అనుమతించిన దాని కన్నా 30 యార్డ్ సర్కిల్ బయట ఒక ఫీల్డర్ ను తక్కువ ఉంచుకుని బౌలింగ్ జట్టు మిగతా ఓవర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా క్లాజ్ 13.8లో ఐసీసీ మార్పులు తెచ్చింది. ఇన్నింగ్స్ లో 20వ ఓవర్ తొలి బంతిని షెడ్యూల్డ్ టైంకి బౌలింగ్ టీం వేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చేయని పక్షంలో ఆ సమయం నుంచి ఇన్నింగ్స్ అయిపోయేదాకా 30 యార్డ్స్ సర్కిల్ బయట నలుగురే ఫీల్డర్లను అనుమతించనున్నారు. సాధారణంగా అయితే టీ-20 ఇన్నింగ్స్ లో 6 ఓవర్ల పవర్ ప్లే తర్వాత ఐదుగురు ఫీల్డర్లు సర్కిల్ బయట ఉండొచ్చు. తాజా స్లో ఓవర్ రేట్ నిబంధనలను అందుకోవడంలో విఫలమైతే బౌలింగ్ టీం ఒక ఫీల్డర్ ను కచ్చితంగా లోపలికి తీసుకురావాలి. ఇన్నింగ్స్ ఆరంభానికి ముందే ఇరు జట్లకు షెడ్యూల్డ్ టైంని అంపైర్లు తెలియచేస్తారు. దాన్ని బౌలింగ్ టీం ఫాలో అవాల్సి ఉంటుంది. ఈ మార్పును ఐసీసీ క్రికెట్ కమిటీ సిఫారసు చేసింది. దీంతో పాటుగా మరో కొత్త వెసులుబాటును ఐసీసీ తీసుకొచ్చింది. ఓ ఇన్నింగ్స్ మధ్యలో, అవసరమనుకుంటే రెండున్నర నిమిషాల డ్రింక్స్ బ్రేక్ ను తీసుకునే సౌలభ్యం కల్పించింది. అయితే ఈ విషయంపై ఇరు జట్ల మధ్య సిరీస్ ఆరంభానికి ముందే ఒప్పందం జరిగి ఉండాలి. తాజా నియమ నిబంధనలు జనవరి 16న జమైకాలో వెస్టిండీస్, ఐర్లాండ్ మధ్య జరిగే టీ20తో అమల్లోకి రానున్నాయి.