శ్రీకాకుళం జిల్లాకే మణిహారంగా నిలుస్తోన్న శ్రీకూర్మం ఆలయం
మహావిష్ణువు దశావతారాల్లో రెండోది కూర్మావతారం. ఈ రూపంలో ఉన్న ఏకైక ఆలయం శ్రీకూర్మం. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి ఆలయం లేదు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో.. శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌కు 27 కిలోమీటర్ల దూరంలో గార మండలంలో ఉందీ ఆలయం. బ్రహ్మ ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రంగానూ ఈ ఆలయం ప్రసిద్ధి. ఎక్కడా లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి. స్వామివారు కూడా పడమటి ముఖంగా ఉండడం మరో ప్రత్యేకత.