Penna Sangam Barrage: నత్త నడకన సంగం బ్యారేజ్ పనులు.. ఇప్పటికీ బ్రిటిషర్లు కట్టిన వంతెనే దిక్కు
నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నా నదిపై ఇప్పటికీ బ్రిటిషర్లు కట్టిన వారధే ప్రజలకు ఏకైక ప్రత్యామ్నాయంగా మారింది. 1882–86 మధ్య ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం సంగం బ్యారేజీ నిర్మించింది. దీని ద్వారా రెండువైపుల రాకపోకలు సాగాయి, సాగునీటిని పంట కాల్వలకు మళ్లించే ఏర్పాటు కూడా ఉంది. కానీ ఇప్పుడా బ్యారేజ్ నీటి ప్రవాహానికి పూర్తిగా నీటమునిగే పరిస్థితి. దీంతో దానికి సమీపంలోనే కొత్త బ్యారేజ్ నిర్మించడానికి అప్పటి వైఎస్ఆర్ సర్కారు శ్రీకారం చుట్టింది. 2006లో మొదలైన పనులు 2022 నాటికి కూడా పూర్తి కాలేదంటే ప్రాజెక్ట్ ఎంత నత్తనడకన సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. కొత్త బ్యారేజ్ పనులు పూర్తి కాకపోవడం, పాత బ్యారేజ్ నిరుపయోగంగా ఉండటంతో దాదాపు ఐదు మండలాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెన్నమ్మ ఉరకలెత్తడంతో.. సంగం వద్ద బ్యారేజ్ పూర్తిగా నీటమునిగింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 3నెలల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా నీటి ప్రవాహం తగ్గడంతో రాకపోకలను పునరుద్ధరించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.