New Covid variant: వెలుగులోకి మరో కొత్త వేరియంట్
ఇటీవలే వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ తోనే ప్రపంచం మొత్తం అవస్థలు పడుతోంది. అంతకంతకూ పెరుగుతున్న కేసులతో కట్టడి చర్యలకు పలు దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇది చాలదన్నట్టు మరో కొత్తరకం వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఫ్రాన్స్ లోని మార్సీయల్స్ నగరంలో IHU B.1.640.2 అనే కొత్త వేరియంట్ ను గుర్తించారు. 12 మంది దీని బారిన పడ్డారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఎపిడీమియోలజిస్ట్ ఎరిక్ ఈ విషయాన్ని తన వరుస ట్వీట్లలో ప్రస్తావించారు. ఈ కొత్త వేరియంట్ లో మొత్తం 46 మ్యుటేషన్లు ఉన్నాయని... ఇది ఒమిక్రాన్ కన్నా ఒకటి ఎక్కువన్నారు. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లను గుర్తిస్తున్నా అవన్నీ ప్రమాదకరంగా ఉండి తీరతాయని చెప్పలేమన్నారు. ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి తీవ్రత ఏమేర ఉంటుందనేది వేచి చూడాల్సిందేనన్నారు. IHU B.1.640.2 అనే ఈ కొత్త వేరియంట్ ఫ్రాన్స్ మినహా ఏ దేశంలోనూ నమోదవలేదు. WHO సైతం ఇంకా దీన్ని ధ్రువీకరించలేదు.