Karimnagar Car Overspeed : అతివేగంతో దూసుకొచ్చి కారు...ప్రమాదంలో నలుగురు మహిళల మృతి | ABP Desam
కరీంనగర్ కమాన్ చౌరస్తాలో తెల్లవారుజామున ఓ కారు సృష్టించిన బీభత్సంలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. కత్తులు, గొడ్డళ్ళు తయారు చేసి విక్రయించుకునే వారిపై నుంచి కారు దూసుకెళ్లడంతో సంఘటన స్థలంలో ఒక మహిళ చనిపోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మహిళలు మృత్యువాతపడ్డారు. చనిపోయిన వారంతా నిరుపేద కుటుంబీకులు. ఈ రోజు ఆదివారం కావడంతో ఉదయం పూట కమాన్ చౌరస్తా లో తయారుచేసిన వస్తువులు అమ్ముకుంటారు. ఈ క్రమంలోనే రోడ్డు పక్కన కూర్చున్న వారి పైకి కారు వేగంగా దూసుకెళ్లింది. వేగంగా వచ్చిన కారు ఒక మహిళను ఢీ కొట్టి స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో కారుకు, స్తంభానికి మధ్య ఇరుక్కుపోయిన మహిళ అక్కడికక్కడే చనిపోయింది. దాదాపు ఈ ఘటనలో 9 మందికి గాయాలు కాగా వీరిలో ముగ్గురు ఆసుపత్రిలో చనిపోయారు. కారు నడుపుతున్న వ్యక్తితో పాటు కారులో ఉన్న వాళ్ళు పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రక్తం మరకలతో సంఘటన స్థలం భీతావహంగా మారగా.. ఆస్పత్రి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. కారుపై ఓవర్ స్పీడ్ చలాన్లు చాలా ఉన్నాయి.