Indrakeeladri Corona:ఇంద్రకీలాద్రిలో దుర్గగుడి అర్చకుడికి కరోనా..నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు
ఇంద్రకీలాద్రిపై కరోనా మళ్లీ కలవరం సృష్టిస్తోంది. నిత్యం వేలాది మంది భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దుర్గగుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు సక్రమంగా అమలు కావటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాస్కులు లేకుండానే భక్తులను దర్శనానికి అనుమతించడం, శానిటైజర్లు సైతం వినియోగించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం కారణమని భక్తులే ఆరోపిస్తున్నారు. తాజాగా ఓ అర్చకుడు జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో అనుమానంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్థారణైంది. పలువురు కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆలయ ఈవో డి.భ్రమరాంబ మాట్లాడుతూ అర్చకుడికి కరోనా విషయం తనకు తెలియదని టీవీల ద్వారానే తెలుసుకున్నట్లు తెలిపారు. అతడిని ఐసోలేషన్‌లో ఉండమని సూచించినట్లు తెలిపారు. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మాస్కులు లేకుండా దర్శనానికి అనుమతించడం లేదని, థర్మల్ స్కానింగ్ చేసి మాత్రమే క్యూ లైన్లలోకి అనుమతిస్తున్నామని చెప్పారు. లక్షణాలు ఉన్న సిబ్బంది అంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.