Tamilnadu Forest Officials Caught Leopard | తమిళనాడులో ఆపరేషన్ చిరుత సక్సెస్ ..కానీ | ABP Desam
తమిళనాడులో ఆపరేషన్ చిరుత సక్సెస్ అయ్యింది. హోసూరు నుంచి తిరుపత్తూరుకు వచ్చిన చిరుత ఓ బడి ప్రాంగంణంలో సంచరిస్తూ అందరినీ హడల్ ఎత్తించింది. స్కూల్ వాచ్ మెన్ పై చిరుత దాడి చేసిందన్న వార్తతో మొదలైన భయం తొమ్మిది గంటల పాటు అధికారులు కష్టపడి దాన్ని బంధించేంత వరకూ సాగింది. బడిలోని షెడ్డుల్లో దాక్కున్న చిరుత దాడి చేస్తుందేమోనన్న భయంతో అదే షెడ్డులో ఐదుగురు ఓ కారులో దాదాపు 7గంటల పాటు తలదాచుకున్నారు. సరే ఇదంతా పక్కనపెడితే అటవీశాఖాధికారులు మత్తు మందు ఇచ్చి చిరుతను పట్టుకున్నారు. గాయపడిన వాచ్ మెన్ ను కృష్ణగిరి ప్రభుత్వాసుపత్రికి పంపించి చికిత్సను అందించారు. ఇక్కడ వరకూ బాగానే ఉన్నా దొరికిన చిరుతపులి ని తిరుపత్తూరు నుంచి 50కిలోమీటర్లు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ కుప్పం పరిధిలో గల వీర్నమల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై ఆంధ్ర అటవీశాఖ అధికారులకు తమిళనాడు అటవీశాఖ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకపోగా..ఇప్పుడు వదిలిపెట్టిన ఆ చిరుత కుప్పం గ్రామాలపైకి దాడికి దిగుతుందేమోనన్న భయం ఇప్పుడు స్థానికులను వెంటాడుతోంది.