Ratan Tata Donations: మహాదాత రతన్ టాటా కన్నుమూత, ఆయన చేసిన దానాలు తెలిస్తే!
దేశంలో 30 లిస్టెడ్ కంపెనీలు ఉన్న రతన్ టాటా ఆస్తి ఎంతో తెలుసా కేవలం 3800కోట్లు. దేశంలో ఉప్పు నుంచి ఉక్కు వరకూ అమ్మే టాటాల వారసుడి ఆస్తి ఇంతేనంటే మనకు ఆశ్చర్యం కలుగొచ్చు. ఎందుకంటే ఇదే దేశంలో వ్యాపార దిగ్గజాల ఆస్తులు లక్షల కోట్లలో ఉంటాయి. కానీ రతన్ టాటా ఏడాదికి రెండున్నర కోట్ల మాత్రమే సంపాదిస్తున్నారు. అది కూడా ఆయనకు టాటా సన్స్ లో ఉన్న షేర్ల కారణంగా వస్తున్నాయి. కానీ మహానుభావుడు రతన్ టాటా తన జీవితంలో దానం చేసిన సొమ్ము ఎంతో తెలుసా...అక్షరాలా 9వేల కోట్ల రూపాయలు. దేశం ఇబ్బందుల్లో ఉందని తెలిస్తే చాలు ముందు కదిలిపోయే గుండె ఆయనదే. మొన్నటికి మొన్న కొవిడ్ మహమ్మారి దేశం మొత్తాన్ని అతలాకుతలం చేస్తే దేవుడిలా ఆదుకున్నాడు రతన్ టాటా.
ఏ వ్యాపారవేత్త ఊహకు అందని రీతిలో 1500కోట్ల రూపాయల భూరి విరాళాన్ని టాటా సన్స్, టాటా గ్రూప్ తరపున ప్రకటించారు రతన్ టాటా. దేశంలో పాఠశాలలు బాగుపడాలని, విద్యావ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ బాగుపడితే అంత కంటే దేశానికి సేవ మరొకటి లేదని నిత్యం చెప్పేవారు రతన్ టాటా. తన జీవితంలో సంపాదన కోసమే కాకుండా సంపాదించిన ప్రతీ రూపాయి దేశం కోసం ఖర్చు పెట్టాడు కాబట్టే ఆయన మృతికి దేశం మొత్తం కదిలిపోతోంది. టాటా అంటే అదొక సంస్థ కాదు దేశం మొత్తం అదొక ఎమోషన్ అనేలా వ్యాపార సామ్రాజ్యాన్ని తీర్చిదిద్దిన ఈ అపర కుబేరుడు..తన దాతృత్వంతో పెద్ద మనసుతో మనం దేశం చూసిన రెండో కర్ణుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రజల మనసులో చిరంజీవిగా నిలిచిపోయారు.