Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam
ముంబై సముద్ర తీరంలో పడవ మునిగిపోయిన ప్రమాదంలో 13మంది మృతి చెందినట్లు ఇండియన్ నేవీ ప్రకటించింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ప్రమాదంపై అధికారిక ప్రకటన చేశారు. ముంబైకి సమీపంలో బుచ్చర్ ఐలాండ్ దగ్గర ఇండియన్ నేవీకి చెందిన ఓ బోటు..ఎలిఫెంటా గుహలకు వెళ్తున్న నీల్ కమల్ అనే పేరున్న టూరిస్ట్ బోటు పరస్పరం ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. పడవ బోల్తా పడిన ఘటనపై వెంటనే అప్రమత్తమైన నేవీ దళాలు..సహాయకచర్యలను ప్రారంభించాయి. 101 మందిని సేఫ్ గా రెస్క్యూ చేయగా..13మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 10 సాధారణ పౌరులు కాగా...3 నేవీ అధికారులు ఉన్నారని సీఎం దేవంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. ముంబై సముద్ర తీరంలో ఉండగానే ఈ ఘోర పడవ ప్రమాదం జరిగింది. గేట్ ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు వెళ్తున్న టూరిస్ట్ ఫెర్రీ నేవీ బోటు ఢీకొట్టడంతో అకస్మాత్తుగా నీటిలో మునిగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో 34మంది టూరిస్టులు పడవలో ఉన్నారు. వీరిలో 21మంది పక్క ఫెర్రీలో ఉన్న వారు కాపాడారు.