Maoists: ఎట్టకేలకు ఇంజినీర్‌ను విడిచిపెట్టిన మావోయిస్టులు
ఏడు రోజుల క్రితం కిడ్నాప్ చేసిన ఇంజినీర్ అజయ్ రోషన్ లక్రాను మావోయిస్టులు ఎట్టకేలకు విడిచిపెట్టారు. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో ఆయన్ను అపహరించారు మావోయిస్టులు. అయితే ఇవాళ ప్రజాకోర్టులో మీడియా ముందు లక్రాను విడుదల చేశారు. ఆ సమయంలో ఇంజినీర్ భార్య అర్పితా లక్రా కూడా అక్కడే ఉన్నారు. గత ఏడు రోజులుగా మీడియా, పెద్దలు ఇంజినీర్‌ను విడుదల చేయాలంటూ మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. ఇంజినీర్ ఆచూకీ కోసం భార్యతో సహా మీడియా సిబ్బంది 7 రోజుల పాటు అడవుల్లో గాలించారు. బీజాపూర్ జిల్లాలో ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద నిర్మిస్తోన్న రోడ్డు పనులను పరిశీలించేందుకు వెళ్లిన ఇంజినీర్ అజయ్ రోషన్ లక్రా, అటెండర్ లక్ష్మణ్ పర్తగిరిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. అయితే అటెండర్ లక్ష్మణ్ పర్తగిరిని రెండు రోజుల అనంతరం విడిచిపెట్టారు. ఇంజనీర్ లక్రా వారి చెరలోనే ఉండగా తాజాగా ఇవాళ ప్రజాకోర్టులో విడులదయ్యారు.ఛత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇటీవల ఆర్కే చనిపోయిన తర్వాత నివురు గప్పిన నిప్పులా ఉంది. అయితే భద్రత మధ్య అభివృద్ది పనులు చేస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం గోర్నాలో కొంత మంది కాంట్రాక్టర్లు రోడ్లు వేస్తున్నారు. ఈ పనులు పరిశీలించేందుకు అప్పుడప్పుడూ ఇంజినీర్లు వెళ్తున్నారు.