![ABP News ABP News](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/20/76a53d6f8fa6993de252c57cf24cfb7d1737388762173310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=200)
Mahakumbh Monalisa | కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను కట్టిపడేసింది | ABP Desam
కుంభమేళాలో మెరిసిన ఓ చిన్నది.. దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది. అయస్కాంత కళ్లతో ఆకట్టుకున్న ఆ అమ్మాయిని ఇప్పుడు బాలీవుడ్ స్టార్లతో పోలుస్తున్నారు.
కుంభమేళాలో పూసలు, దండలు అమ్ముకునే ఓ అమ్మాయి ఇప్పుడు నేషనల్ సన్సేషన్. మెరిసే కళ్లతో చురుకైన చూపులతో ఆకట్టుకున్న ఆ టీనేజ్ అమ్మాయే.. ఇప్పుడు సోషల్ మీడియాలో సన్సేషన్. దేశం మొత్తం కుంభమేళలో తన గురించి చర్చ జరిగేలా చేసుకున్న ఆ సన్సేషన్ పేరు మోనాలిసా భోస్లే..
మధ్యప్రదేశ్ మోనాలీసా
లక్షలాదిమంది మనసు దోచుకున్న మోనాలీసాది మధ్యప్రదేశ్‌లో ఇండోర్ దగ్గరనున్న మహేశ్వర్ అనే ప్రాంతం. వీళ్లది పూసలు, రుద్రాక్షలు అమ్ముకునే వ్యాపారం. లక్షలాది మంది భక్తులు తరలివస్తున్న మహాకుంభ్‌లో పూసల దండలు అమ్మేందుకు ఈ అమ్మాయి ప్రయాగరాజ్ వచ్చింది. చూడటానికి ఆకర్షణీయంగా మాటల్లో ఆత్మవిశ్వాసం చూపిస్తున్న ఈ చిన్నది మీడియా కంట పడింది. రెండు రోజుల్లో ఈ అమ్మాయి.. సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. తీర్చిదిద్దినట్లున్న ఆ అమ్మాయి కాటుక కళ్లకు అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. అద్భుతమైన అందం ఉన్న తను మట్టిలో మాణిక్యం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఇంటికి పంపేసిన తండ్రి
ఎక్కడో మారమూల ప్రాంతం నుంచి ఎలాంటి మీడియా హడావుడి లేని చోట నుంచి వచ్చిన వీళ్ల ఫ్యామిలీ ఒక్కసారిగా వచ్చిన ఈ ఫేమ్‌ను సరిగ్గా తీసుకోలేకపోయింది. వందల మంది జనం, ఒక్కసారిగా పెరిగిపోయిన మీడియా తాకిడికి ఆ కుటంబం తట్టుకోలేకపోయింది. తన కూతురిపై వస్తున్న అటెన్షన్ తనకు ప్రమాదమని భావించి ఆ అమ్మాయి తండ్రి ఆమెను సొంతూరికి పంపించేశారు. ప్రస్తుతం ఆమె సోదరులు మాత్రమే మహాకుంభ్‌లో వ్యాపారం చేస్తున్నారు. జనం ఎక్కడికి వెళ్లినా మోనాలిసా వెంట పడుతున్నారు. తను వ్యాపారం కూడా చేసుకోలేకపోతోంది. పూసల దండల అమ్మడమే నా జీవనాధారం. అది దెబ్బతింటోంది. అందుకే మా నాన్న తనను పంపిచేశాడు అని సోదరి విద్య చెప్పింది.