
Maha Kumbh 2025 Mouni Amavasya | మౌని అమావాస్య రోజు కుంభమేళాలో మహా అపశృతి | ABP Desam
ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఘోర విషాదం నెలకొంది. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమంలో స్నానం ఆచరించేందుకు కోట్లాదిగా భక్తులు తరలివచ్చారు. 144 ఏళ్లకు ఓ సారి వచ్చే మౌని అమావాస్య మూహూర్తం కావటంతో...ఆఖాడాలతో పాటు గా స్నానం చేయాలని వచ్చిన భక్తులు ఒక్కసారిగా వెళ్లేందుకు తాపత్రయ పడ్డారు. ఫలితంగా భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. 20 మంది భక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. చాలా మంది గాయపడగా వారిని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఒక్కరోజే ప్రయాగరాజ్ కు 3కోట్ల నుంచి 7కోట్ల మంది వరకూ వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కొద్దిరోజులుగా ప్రయాగరాజ్ లోనే ఉండి ఏర్పాట్లన్నీ పరిశీలిస్తున్నారు. అయినా కోట్లాది భక్తులు తరలివచ్చే వేడుక కావటంతో ఎన్ని వేలమందిని పెట్టినా భక్తులకు సదుపాయాలు కల్పించలేని పరిస్థితులు ఉన్నాయి. ఫలితంగా తొక్కిసలాట జరిగి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై ప్రధాని మోదీ తీవ్రసంతాపాన్ని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు సరైన వైద్య సదుపాయాలు అందించాలని ఆదేశించారు. తొక్కిసలాట ఘటనతో ఆఖారాలు తమ మంగళ స్నాన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాయి. వసంత పంచమి రోజు తమ మంగళ స్నానాలు నిర్వహిస్తామని ప్రకటించాయి.