త్రిదళాధిపతి బిపిన్ రావత్ మృతి- ప్రముఖుల సంతాపం
మహాదళాధిపతి బిపిన్ రావత్ మృతితో దేశవ్యాప్తంగా విషాదం అలుముకుంది. రావత్ సతీమణి మధులికా రావత్ సహా మరో పదకొండు చాపర్ కుప్పకూలిన ప్రమాదంలో కన్నుమూయటం దేశం యావత్ విస్మయానికి గురి చేసింది. భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్...ధైర్యవంతుడైన బిడ్డను భారత్ కోల్పోయిందంటూ ట్వీట్ చేశారు.జనరల్ బిపిన్ రావత్ నిబద్దత కలిగిన సైనికుడని... నిజమైన దేశభక్తుడని అన్నారు ప్రధాని మోదీ. దేశ సాయుధ దళాలను, భద్రతా యంత్రాంగాన్ని ఆధునీకరించడంలో ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. వ్యూహాత్మక విషయాలపై అతనికి చాలా పట్టుందని అలాంటి వ్యక్తి మృతి తీవ్రంగా కలచివేసిందన్నారు మోదీ. సీడీఎస్ బిపిన్ రావత్‌ను కోల్పోవడం దేశానికి చాలా లోటు అని అభిప్రాయపడ్డారు కేంద్రహోమంత్రి అమిత్‌షా. చాలా విషాదకరమైన రోజని... మాతృభూమికి అత్యంత భక్తి శ్రద్ధలతో సేవ చేసిన వీర సైనికుల్లో ఒకడు మృతి చెందడం బాధాకరమన్నారు. అతని ఆదర్శప్రాయమైన సహకారం, నిబద్ధత మాటల్లో చెప్పలేమన్నారు.రాజ్ నాథ్ సింగ్, రాహుల్ గాంధీ, ఏపీ సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు. సినీ, రాజకీయ, క్రీడా రంగా ప్రముఖులు సైతం బిపిన్ రావత్ కు ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.