Hamas Chief Yahya Sinwar Killed | హమాస్ చీఫ్ సిన్వర్‌ని ఇజ్రాయేల్ ఎలా చంపింది | ABP Desam
యుద్ధం అంటే ఊరికే అలా ఆయుధాలు వేసుకుని మీద పడిపోవడం కాదు. శత్రువు కదలికల్ని గమనించి..ఎప్పుడు ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో వ్యూహం సిద్ధం చేసుకోవాలి. ఇజ్రాయేల్ ఇదే చేస్తోంది. ముఖ్యంగా హమాస్ కీలక నేతల్ని మట్టుబెట్టేందుకు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగుతోంది. సిన్వర్‌ని హతమార్చే ముందూ నిఘా పెట్టింది. అంతే కాదు. సిన్వర్ ఎక్కడున్నాడో గుర్తించేందుకు ఇంటింటికీ తిరిగారు ఇజ్రాయేల్ సైనికులు. దాడులు చేస్తూనే ప్రతి ఇంటినీ ట్రాక్ చేస్తూ వెళ్లారు. చాలా రోజులుగా ఇదే విధంగా ట్రాక్ చేస్తోంది. ఓ ఇంటి నుంచి మరో ఇంటికి తప్పించుకుంటూ దాగుడు మూతలు ఆడాడు సిన్వర్. సిన్వర్‌తో పాటు మరో ముగ్గురు టెర్రరిస్ట్‌లూ ఇదే పని చేశారు. ఇది ఇజ్రాయేల్ సైన్యం గుర్తించింది. వరుస పెట్టి ఆ ఇళ్లపై దాడులు చేసింది. డ్రోన్ కెమెరాలనూ ఎగరేసింది. ఇది గమనించిన హమాస్ చీఫ్ సిన్వర్ ఆ కెమెరాలకు చిక్కకుండా ఓ ఇంట్లోకి ఒంటరిగా పరుగులు పెట్టాడు. అప్పటికే డ్రోన్ అతని జాడని గుర్తించడం వల్ల సైనికులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి సోఫాలో కూలబడిపోయాడు హమాస్ చీఫ్ సిన్వర్. వెంటనే దాడి చేసి అక్కడే మట్టుబెట్టింది ఇజ్రాయేల్ సైన్యం. హైడ్ అండ్ సీక్ ఆడిన టెర్రరిస్ట్‌ని గుర్తించి హతమార్చింది.