భారత్ కెనడా మధ్య మరోసారి రాజుకున్న వివాదం
బట్ట కాల్చి మీద వేయడం అనే ఓ సామెత ఉంది. సింపుల్‌గా పై వాళ్ల మీద నిందలు వేయడం అని దీనర్థం. ఇప్పుడు కెనడా ఇదే చేస్తోంది. ఖలిస్థాన్ వేర్పాటు వాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైనప్పటి నుంచి...భారత్‌పై గురి పెట్టింది కెనడా ప్రభుత్వం. నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందని ఆరోపించి అంతర్జాతీయ సమాజం ముందు విలువ పోగొట్టుకున్నారు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో. సరే..ఓ సారంటే నోరు జారారు అనుకోవచ్చు. కానీ..మళ్లీ ఇప్పుడు అదే పాట పాడారు. ముంబయిలో NCP నేత బాబా సిద్దిఖీ హత్య తరవాత లారెన్స్ బిష్ణోయ్ పేరు మరోసారి మారు మోగుతోంది. ఈ సారి ఈ వంక పెట్టుకుని భారత్‌పై ఆరోపణలు చేసింది కెనడా. కెనడాలోని కొందరు ఇండియన్స్..ముంబయిలోని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో పని చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది. ఓ ప్రెస్‌నోట్ కూడా విడుదల చేసింది. కెనడాలోని కీలక అంతర్గత విషయాల్ని ఇండియన్ ఏజెంట్స్ తెలుసుకుంటున్నారనీ ఆరోపించింది. ఇప్పటికే కెనడా తీరుతో ఒళ్లు మండిపోయి ఉన్న భారత్..ఈ ఆరోపణలపై ఘాటుగా స్పందించింది.