బంగారం వ్యాపారి వద్ద నమ్మకంగా ఉంటూ భారీ మెత్తంలో నగదుతో పరారయిన కారు డ్రైవర్
విజయవాడ పాతబస్తీకి చెందిన బంగారు వ్యాపారి పంచుమర్తి సుబ్రహ్మణ్యం వద్ద మేనేజర్ గా పని చేస్తున్న గోలి రాధాకృష్ణ వ్యాపార లావాదేవీల్లో భాగంగా కోటి 64 లక్షల 50 వేల రూపాయల నగదును తనకు అత్యంత నమ్మకస్తుడైన డ్రైవర్ గండికోట ఫణీంద్ర, ఇంకా సుంకర రామాంజనేయులు, బేలు శ్యామ్ అనే ముగ్గురికి ఇచ్చి చెన్నైకి పంపారు. అయితే నగదు ఎలాగైనా కాజేయాలనే ఉద్దేశంతో ఉన్న ఫణీంద్ర, కావలి సమీపానికి రాగానే కారు ట్రబుల్ ఇచ్చిందనే నెపంతో రోడ్డు పక్కన ఆపాడు. అదే సమయంలో బైక్ పై వచ్చిన నక్కా శివ నాగరాజు, సాయిబాబు కారును ఢీ కొట్టి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో రామాంజనేయులు శ్యామ్ కారు దిగి వారితో మాట్లాడుతుండగా ఫణీంద్ర ఒక్కసారిగా కారు వేగంగా నడిపి నగదుతో ఉడాయించాడు. దీంతో అవాక్కయిన మిగిలిన వారు, మేనేజర్ రాధాకృష్ణకు విషయాన్ని తెలిపారు. దీంతో అతడు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి విచారించారు. నగదుతో పారిపోయిన ఫణీంద్ర అతడికి సహకరించిన మరో ఐదుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ బాబురావు వివరించారు.