DRS Controversy: మరోసారి డీఆర్ఎస్ తో తీవ్ర దుమారం
నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న భారత్-దక్షిణాఫ్రికా ( Ind vs SA) మూడో టెస్టులో వివాదాస్పద సంఘటన చోటు చేసుకుంది. ఆఖరి ఇన్నింగ్స్ లో సఫారీ కెప్టెన్ డీన్ ఎల్గర్.... అశ్విన్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్ ఔట్ ఇచ్చాడు. ఎల్గర్ సమీక్ష కోరాడు. రీప్లే చూస్తుండగానే తాను ఔట్ అని అతనికి అర్థమైపోయి, పెవిలియన్ వైపు నడవడం మొదలుపెట్టాడు. అయితే, బంతి అతని మోకాలి కన్నా కింద తాకినా... ఆ గమనం వికెట్ల మీద నుంచి వెళ్తుందని, బాల్ ట్రాకింగ్ టెక్నాలజీ చూపించింది. దీంతో అతను నాటౌట్ గా తేలింది. బ్యాటింగ్ కు మళ్లీ వచ్చాడు. రీప్లేలో దీన్ని చూసిన అంపైర్ ఎరాస్మస్ సైతం... ఇది ఇంపాజిబుల్ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కోహ్లీ ఆగ్రహంతో ఊగిపోయాడు. మ్యాచ్ ప్రసారం చేస్తున్న బ్రాడ్ కాస్టర్ తీరును విమర్శించాడు. ఎప్పుడూ ప్రత్యర్థులు ఏం చేస్తున్నారనే విషయంపైనే కాదు, మీ జట్టువాళ్లు ఏం చేస్తున్నారో కూడా చూడండి అంటూ ఆగ్రహించాడు. కే ఎల్ రాహుల్ సైతం ఓ దేశం మొత్తం మన 11 మందికి వ్యతిరేకంగా ఆడుతోందని చురక అంటించాడు. గెలిచేందుకు సూపర్ స్పోర్ట్ ఇంకా మంచి విధానాలు ఎంచుకోవాలని అశ్విన్ విమర్శించాడు.