వినాయక నిమజ్జనంలో ఘర్షణలు, కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్తతలు
కర్ణాటకలోని మాండ్యాలో రెండు రోజులుగా ఘర్షణలు కొనసాగుతున్నాయి. వినాయకుడి విగ్రహంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఓ మసీదు నుంచి ఈ రాళ్లు విసిరారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ఊరేగిస్తుండగా ఈ ఘటన జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. అప్పటి నుంచి స్థానికంగా గొడవలు జరుగుతున్నాయి. మాండ్యాలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి 52 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులు కొందరు పోలీస్ స్టేషన్ ఎదుట భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వినాయకుని విగ్రహాన్ని పెట్టి అక్కడే నిరసనలు వ్యక్తం చేశారు. న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. అక్కడి వరకూ పరిస్థితులు అదుపులోనే ఉన్నా...ఆ తరవాత నిరసనకారులు షాప్స్‌ని తగలబెట్టారు. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. మాండ్యా పరిసర ప్రాంతాల్లో 48 గంటల పాటు కర్ఫ్యూ విధించారు పోలీసులు. ఈ ఘటనపై కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర స్పందించారు. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, రెండు వర్గాలకు చెందిన 52 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు.