జవాన్ల త్యాగాలను కళ్లకు కట్టే బీఎస్‌ఎఫ్ మ్యూజియం, ఎక్కడుందంటే?
మనలో చాలా మంది బీఎస్ఎఫ్ జవాన్లు అనే పేరు విని ఉంటారు. కానీ వారి రోజువారీ విధులు ఏంటి? ఎటువంటి కఠిన పరిస్థితుల్లో పని చేస్తారనే విషయం మనలో చాలా మందికి తెలియదు. కానీ ఎప్పుడైనా పంజాబ్‌లోని అటారి-వాఘా సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన బీఎస్‌ఎఫ్ (Border Security Force) మ్యూజియంకు వెళ్తే ఈ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. భారత దేశ పరిరక్షణకు బీఎస్‌ఎఫ్ జవాన్లు చెసే సేవలు, వారి త్యాగాలను గుర్తు చేయడంతో పాటు, దానిపై సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ బీఎస్ఎఫ్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసారు అధికారులు. Amritsar Railway Station నుంచి 34 కిలోమీటర్ల దూరంలో బీటింగ్ రిట్రీట్ సెరిమోని జరిగే ప్రాంగణంలో బీఎస్ఎఫ్ మ్యూజియం ఉంది. ఈ మ్యూజియంను 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. బీఎస్‌ఎఫ్ చరిత్రను, దేశ పరిరక్షణకు వారు నిర్వహించే మిషన్స్ గురించిన సమగ్ర వివరాలను ఈ మ్యూజియంలో చూడవచ్చు. ఈ మ్యూజియంలోకి ఎంట్రీ ఫీజు కేవలం రూ.10 మాత్రమే.