ముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి
ముంబయిలోని కుర్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బిజీగా ఉన్న రోడ్‌పై బస్ బీభత్సం సృష్టించింది. ఉన్నట్టుండి అదుపు తప్పి వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మితిమీరిన వేగంతో వచ్చిన బస్ ముందు ఓ ఆటోని ఢీకొట్టింది. ఆ తరవాత ముందుగా ఉన్న అన్ని వాహనాలనూ ఢీకొడుతూ వెళ్లిపోయింది. బ్రేక్‌లు ఫెయిల్ అవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 25 మందికి పైగా గాయపడగా వాళ్లందరినీ స్థానిక ఆసుపత్రులకు తరలించారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కుర్లా నుంచి అంధేరి వెళ్లే సమయంలో బస్ అదుపు తప్పిందని అక్కడి సీసీ టీవీ ఫుటేజ్‌ని ఆధారంగా నిర్ధరించారు. అదుపు తప్పి ఇళ్లలోకి దూసుకెళ్లడం వల్ల ఒక్కసారిగా అక్కడ అలజడి రేగింది. ఈ ఘటనలో ఓ పోలీస్ వాహనం కూడా నుజ్జునుజ్జైంది. మూడు నెలల క్రితమే బస్ రిజిస్ట్రేషన్ అయినట్టు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారికి చికిత్స అందుతోంది.