Bumrah-Jansen : బుమ్రా-జెన్సన్ సై అంటే సై
జోహాన్నెస్ బర్గ్ లో భారత్-సౌతాఫ్రికా మధ్య నువ్వా నేనా అంటూ సాగుతున్న రెండో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ జట్టుకే ఆడే జస్ ప్రీత్ బుమ్రా, మార్కో జెన్సన్ మధ్య చిన్నపాటి స్లెడ్జింగ్ జరిగింది. 54వ ఓవర్ లో బుమ్రా బ్యాటింగ్ చేస్తుండగా... మార్కో జెన్సన్ బౌన్సర్ల వర్షం కురిపించాడు. ఓ బంతి బుమ్రా భుజాన్ని తాకినా అతని చిరునవ్వుతోనే కనిపించాడు. అయితే ఆ తర్వాత కూడా జెన్సన్ బౌన్సర్లు కొనసాగించటంతో ఇద్దరూ పిచ్ మధ్యకు వచ్చి పరస్పరం మాటలు అనుకున్నారు. ఈ కోపాన్ని రబాడ తర్వాతి ఓవర్లో చూపించిన బుమ్రా... ఓ సిక్సర్ బాదాడు. దానికి భారత్ డ్రెసింగ్ రూం చప్పట్లతో అభినందించింది. అయితే... జెన్సన్- బుమ్రా ఘటనను ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో అండర్సన్-బుమ్రా ఘటనతో నెటిజన్లు పోలుస్తున్నారు. అప్పుడు బుమ్రాతో అండర్సన్ స్లెడ్జింగ్ చేయగా... మన పేసుగుర్రం జిమ్మీ బ్యాటింగ్ కు వచ్చినప్పుడు హడలెత్తించాడు. ఇప్పుడు సౌతాఫ్రికా బ్యాటర్ల పరిస్థితీ అలానే ఉంటుందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.