నటి కస్తూరి అరెస్ట్, 14 రోజుల రిమాండ్
తెలుగు వాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిని పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఆమెని చెన్నైకి తరలించారు. అక్కడ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు ఆమెకి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 29 వరకూ రిమాండ్‌లో ఉంచాలని ఆదేశించింది. నవంబర్ 16వ తేదీన హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో చెన్నై పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు. తెలుగు వాళ్లంతా ఒకప్పుడు రాజులకు సేవకులుగా పని చేశారని, తెలుగు మహిళలంతా చెలికత్తెలుగా ఉన్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కస్తూరి. అప్పటి నుంచి తెలుగు సంఘాలు ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఆమె క్షమాపణలు కోరినప్పటికీ...వెనక్కి తగ్గలేదు. చర్యలు తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేశాయి. తెలుగు సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కస్తూరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొద్ది రోజులు అజ్ఞాతంలో ఉన్న కస్తూరిని వెతికి అరెస్ట్ చేశారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, రోజూ షూటింగ్‌కి వెళ్తున్నానని స్టేట్‌మెంట్ ఇచ్చారు కస్తూరి.