Kartikeya Mishra Controversy: తహసీల్దార్లపై ప.గో. జిల్లా కలెక్టర్ అనుచిత వ్యాఖ్యలు... ఆడియో వైరల్!
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నోటి దురుసుతో వివాదంలో చిక్కుకున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంలేదని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తహసీల్దార్ లను యూజ్ లెస్ ఫోలోస్ అని నోరుజారారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగుల సంఘం కలెక్టర్ ను కలిశారు. ఒకే కుటుంబంలా భావించి వ్యాఖ్యలు చేసినట్లు కలెక్టర్ అన్నారు. పలు చోట్ల కలెక్టర్ కు వ్యతిరేకంగా నిరసనలు కూడా జరిగాయి. సామాజిక మాధ్యమాల్లో కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆడియో వైరల్ అయ్యింది.
క్షమాపణ చెప్పాలని డిమాండ్
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తీకేయ మిశ్రా తహసీల్దార్లపై చేసిన అనుచిత వ్యాఖ్యాలకు క్షమాపణ చెప్పాలని గుంటూరు తహసీల్దార్ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. కలెక్టర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇవాళ , రేపు నిరసనలు చేపడతామని తెలిపారు. ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్లు ఇలా మాట్లాడడం సరికాదన్నారు. కొంత మంది ఐఏఎస్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు.