Viral video: నెల్లూరులో వియ్యంకుల కొట్లాట... ఇటుకలతో పరస్పర దాడి
నెల్లూరు ధనలక్ష్మీపురంలో వియ్యంకుల మధ్య జరిగిన దాడి ఘటన సంచలనంగా మారింది. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కోడలు చంటి బిడ్డతో ఇంటికి రాగా.. అత్తమామలు ఆమెను తన్ని తరిమేశారు. కోడలు తరఫున మాట్లాడేందుకు వచ్చిన ఆమె బాబాయిపై ఇటుక రాళ్లతో దాడి చేశారు. నెల్లూరు ధనలక్ష్మీపురానికి చెందిన విజయేంద్ర రెడ్డికి, తిరుపతికి చెందిన ఊహారెడ్డికి ఏడాది క్రితం వివాహం జరిగింది. అప్పటికే విజయేంద్ర రెడ్డికి రెండు కిడ్నీలు చెడిపోయాయని, ఆ విషయం దాచి పెట్టి పెళ్లి చేశారని ఆరోపిస్తున్నారు అమ్మాయి తరపు బంధువులు. ఈ క్రమంలో విజయేంద్ర రెడ్డి మరోసారి అనారోగ్యానికి గురయ్యాడు. పక్షవాతం కూడా వచ్చింది. అనారోగ్యంతో వచ్చిన సమస్యలు తట్టుకోలేక విజయేంద్రరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆ ఆత్మహత్యకు కారణం అమ్మాయి తరపు వారేనని విజయేంద్రరెడ్డి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.