Nellore Floods: నెల్లూరు జిల్లా పులిగుంట చెరువుకు గండి
నెల్లూరు జిల్లా వాసులు ఏ క్షణాన ఏ చెరువు కట్ట తెగుతుందో, ఏ అలుగు ఉరకలెత్తుతుందో తెలీని భయాందోళనల్లో ఉన్నారు. దాదాపుగా జిల్లాలోని అన్ని చెరువులు నిండు కుండల్లా ఉన్నాయి. ఇకపై ఒక్క సెంటీమీటర్ వర్షపాతం ఎక్కువగా పడినా.. ఏం జరుగుతుందో అంచనా వేయలేని పరిస్థితి. తాజాగా అనంతసాగరం మండలం పులి గుంట చెరువు కట్ట తెగడంతో భారీగా వరద నీరు ఊళ్లోకి వచ్చింది. ఇళ్లలోకి వరదనీరు వస్తోంది. రోడ్లన్నీ వరదనీటితో నిండిపోయాయి. అనంతసాగరం తహశీల్దార్ ఆఫీస్, ఎంపీడీవో ఆఫీస్, పోలీస్ స్టేషన్, సచివాలయం.. కూడా నీటమునిగాయి. వాస్తవంగా ఈ చెరువు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ పరిధిలో ఉంటుంది. ఇటీవల చెరువు కట్ట మరమ్మతు పనుల్ని రెవెన్యూ విభాగం మొదలు పెట్టాలనుకుంది. ఉపాధి హామీ పనులు చేపట్టడానికి సర్వం సిద్ధం చేసింది. అయితే అటవీ అధికారులు అది తమ పరిధిలోనిదని, తామే మరమ్మతులు చేస్తామని చెప్పడంతో ఆ పనులు ఆగిపోయాయి. దీంతో ఇప్పుడిలా చెరువుకట్ట తెగిందని స్థానికులు ఆవేదవ వ్యక్తం చేస్తున్నారు.