Srikakulam Fisherman Boats Fire: నడిసంద్రంలో అగ్ని ప్రమాదాలు, వణికిపోతున్న మత్స్యకారులు
సముద్రాన్నే నమ్ముకుని బతికే గంగపుత్రులకు పరిస్థితులు దినదినగండంగా ఉంటాయి. ప్రాణాలతో చెలగాటమాడుతూ సాగించే చేపలవేట ఓ వైపు...బోట్లు తగలబడిపోయి నడిసంద్రంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మరోవైపు..మత్య్సకారుల జీవితాలు సముద్రంలోని అలల్లానే అస్థిరంగా ఊగిసలాడుతూ ఉంటాయి.
చేపలవేటకు వెళ్లే ముందు మత్స్యకారులు క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్తే చాలు అనుకుంటారు. తుపానులు కలవరపెట్టకూడదని..అగ్నిప్రమాదాలు ప్రాణాలు బలితీసుకోకూడదని వారు మొక్కే మొక్కులు ఒకటి రెండూ కాదు. ఇటీవలి కాలంలో నడిసముద్రంలో బోట్లు తగలబడుతూ మత్స్యకారుల ప్రాణాలు ఇబ్బందుల్లో పడుతున్న సందర్భాలు వారి అవస్థలకు అద్దం పడుతున్నాయి.
నేను ప్రయాణిస్తున్న ఈ మత్య్సకారులంతా శ్రీకాకుళం జిల్లా బందరువానిపేటకు చెందిన వారు. అనుకోని పరిస్థితుల్లో ప్రకృతికి ఎదురువెళ్తూ వీళ్లు పడే ఇబ్బందులను అడిగితే నన్నూ వీళ్లతో పాటు రమ్మన్నారు. వాళ్ల కష్టాలను, కన్నీళ్లను దగ్గర్నుండి చూసి అర్థం చేసుకోమని వాళ్లు అడిగారు. ఉన్నపళంగా బోటుకు మంటలు అంటుకుని ప్రాణభయంతో వణికిపోయే సందర్భాలను గుర్తు చేసుకుంటే చాలు వాళ్ల ఆలోచనలు ఇంటి మీదకు మళ్లిపోతాయని..బతికి ప్రాణలతో బయటపడితే చాలు అనుకుంటామని చెబుతున్నారు. పక్కబోట్ల వాళ్లు వచ్చి కాపాడితే ప్రాణాలు దక్కించుకుని బతుకుజీవుడా సముద్రం మీద బతుకుతూ ఆకలిపోరాటం చేస్తున్నామని చెబుతున్నారు.
బోటులో ఉండే గ్యాస్ సిలిండర్లు లీకై..తుపానుకు పిడుగులు పడి కూడా బోట్లలో మంటలు వస్తుంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ దొరకని పరిస్థితుల్లో తమకు ఏం జరిగిందో కూడా కుటుంబాలకు చెప్పే వారు ఉండరు. ప్రభుత్వం ఇలా దురదృష్టవశాత్తు మరణించే మత్య్సకారుల కుటుంబాలను ఆదుకోవాలని వీరంతా కోరుతున్నారు.