TTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam
తిరుమల వైకుంఠ దర్శనం టోకెన్ల పంపిణీ కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్ల దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. జరిగిన విషాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్న బీఆర్ నాయుడు..అధికారుల తీరుపై చంద్రబాబు మండిపడినట్లు ఛైర్మన్ తెలిపారు. తిరుమల శ్రీవారిని వైకుంఠ ఏకాదశికి దర్శించుకోవాలని భక్తులు పడిన తాపత్రయం...తీవ్ర విషాదాన్ని నింపింది. ఆఫ్ లైన్ లో టీటీడీ జారీ చేసే టోకెన్ల కోసం తిరుపతిలో పంపిణీ కేంద్రాల వద్దకు వేలాదిగా చేరుకున్న భక్తులు గేట్లు తీయగానే ఒక్కసారిగా లైన్లోకి వెళ్లేందుకు చేసిన ప్రయత్నం తొక్కిసలాటకు కారణమైంది. ఫలితంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో తొక్కిసలాటలో ఐదుగురు చనిపోగా...మరొకరు అస్వస్థతతో కన్నుమూశారు. 48 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు తిరుపతి రుయా, స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తిరుపతిలో శ్రీనివాసం, బైరాగిపట్టెడ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద తోపులాటలు, తొక్కిసలాట ఘటనలు జరిగాయి. టీటీడీ అధికారుల సమన్వయ లోపం, పోలీసుల వైఫల్యం, టోకెన్ల కోసం భక్తుల తాపత్రయంతో ఘటనకు కారణంగా తెలుస్తోంది. మృతుల్లో ఐదుగురు మహిళలు కాగా..ఒక పురుషుడు ఉన్నారు.