తిరుమల విధుల్లో ఉన్న ఎఫ్ఎంస్ సిబ్బందిపై చిరుత దాడి
తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో చిరుత కలకలం రేపింది. విధుల నిమిత్తం రెండవ ఘాట్ రోడ్డులో ఆనంద్., రామకృష్ణలు తిరుమలకు వెళ్తున్నారు. వినాయక స్వామి ఆలయాన్ని దాటినా వెంటనే చిరుత ఒక్కసారిగా వీరిపై దాడికి యత్నించింది. చిరుత దాడిలో ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న విజిలెన్స్ సిబ్బంది అంబులెన్స్ సహాయంతో హుటాహుటిన తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు. ఎఫ్ఎంఎస్ సిబ్బందికి చిరుత దాడిలో స్వల్ప గాయాలు అయ్యాయని తిరుమల విజిఓ బాలిరెడ్డి అన్నారు. చిరుత గోళ్ళతో దాడి చేయడంతో పెద్దగాయాలు కాలేదన్నారు. చిరుత రోడ్డు దాటే క్రమంలో ఇద్దరు బైక్ పైన రావడంతో సంఘట జరిగి ఉండొచ్చన్నారు. చిరుత పులులు సంచారం శేషాచల అటవీ ప్రాంతంలో అధికమైందన్నారు. ప్రయాణం చేసే సమయంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చిరుత భయంతోనే దాడికి దిగుంటుందని, సాధారణంగా చిరుతలు మనిషిపై దాడి చేయవన్నారు.