Tirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP Desam
తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజు స్వామి వారి ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుందనే భక్తుల నమ్మకం ఏటా లక్షలాది మంది భక్తులను తిరుపతికి రప్పిస్తుంది. ప్రతీసారి చేసినట్లే ఈ సారి కూడా ఆన్ లైన్ అండ్ ఆఫ్ లైన్ విధానంలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేసింది టీటీడీ. తొలుత ఆన్ లైన్ లో టికెట్లు విడుదల చేశారు. టికెట్లు దొరకని వాళ్లు...ఆన్ లైన్ విధానంపై అవగాహన లేని వాళ్ల కోసం వైకుంఠ ఏకాదశి దర్శనాలు ప్రారంభమయ్యే ఒక్కరోజు ముందు తిరుపతిలో శ్రీనివాసం, విష్ణునివాసం, బైరాగిపట్టెడ లాంటి 8 కేంద్రాల్లో టీటీడీ టోకెన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 9వ తారీఖు ఉదయం 5గంటల నుంచి టోకెన్లు ఇస్తామని చెప్పటంతో 8వ తేదీ మధ్యాహ్నం నుంచే క్యూలైన్లో నిలబడదామని భక్తులు టోకెన్ల పంపిణీ సెంటర్లకు వచ్చేశారు. వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు..ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లు అంతా స్వామి వారి దర్శన టోకెన్ల కోసం పడిగాపులు గాచారు. గేట్లు ఎప్పుడెప్పుడు తీస్తారా అని ఎదురు చూశారు. గేటు తీసే సమయం కోసం పెనగులాడూతు గుంపులు గుంపులుగా వెయిట్ చేశారు. పోలీసులు తాళ్లు కట్టి భక్తులను అదుపు చేసేందుకు చేసిన యత్నాలు ఏమీ వర్కవుట్ కాలేదు. సరే క్యూలైన్లలోకి వదిలేస్తే బయట రష్ తగ్గుతుంది అని పోలీసులు టీటీడీ అధికారుల తీసుకున్న నిర్ణయం...ఊహించని విషాదానికి కారణమైంది. గేట్లు తీయగానే క్యూలైన్లలోకి వెళ్లేందుకు భక్తులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. గేట్ లో నుంచి లోనికి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు తొక్కిసలాటకు కారణమయ్యాయి. ఒకరి మీద ఒకరు తోసుకుంటూ నెట్టుకూంటూ భక్తులు పరుగులు పెట్టడంతో చాలా మంది కింద పడి పోయారు. ఊపిరి ఆడక అస్వస్థతకు లోనయ్యారు.అలా జరిగిన ఈ ఘోర విషాదంలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు భక్తులు బైరాగిపట్టెడలో ఏర్పాటు చేసిన కౌంటర్ సెంటర్ వద్దే చనిపోగా... తమిళనాడుకు చెందిన ఓ భక్తురాలు మాత్రం శ్రీనివాసం దగ్గర అస్వస్థతకు గురై చనిపోయారు.