తిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దు
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన శుక్రవారం పంచమితీర్థం ఉత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి తీసుకెళ్లడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయ తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు, శ్రీ పెద్ద జీయర్, శ్రీ చిన్నజీయర్ స్వాముల వారు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పసుపు కుంకుమ, సారెను ఆలయం నుండి మేళతాళాల నడుమ ఆలయం నుండి బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఊరేగింపుగా ఆలయ నాలుగు మాడ వీధుల గుండా తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్దకు చేరుకుంటుంది. అక్కడ సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఏనుగుపై కోమలమ్మ సత్రం (ఆర్‌ఎస్‌గార్డెన్), తిరుపతి పురవీధుల గుండా తిరుచానూరు పసుపు మండపానికి చేరుకుంటుంది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకస్వాములు, అధికార గణంతో కలిసి ఊరేగింపుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పుష్కరిణి వద్దకు సారెను తీసుకువెళ్తారు.