Sri Kumaradhara Theertha Mukkoti | తిరుమలలో ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి | ABP Desam

Continues below advertisement

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి వాయవ్యదిశలో వెలసివున్న శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి శుక్రవారం ఘనంగా జరిగింది.
 
ఈ సందర్భంగా కుమారధార తీర్థ ముక్కోటికి విచ్చేసే భక్తులకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులకు శ్రీవారి సేవకుల సహకారంతో పాలు, కాఫీ, ఉప్మా, పొంగలి, సాంబారు అన్నం, పెరుగన్నం, పులిహోర, మజ్జిగ, తాగునీరు  అందించారు. టీటీడీ విజిలెన్స్, పోలీస్, అటవీ విభాగాలు సమన్వయంతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించారు.
 
ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే కుమారధార తీర్థముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం భక్తులు ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు.
  
వరాహ, మార్కండేయ పురాణాల ప్రకారం ఒక వృద్ద బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తుండేవాడు. శ్రీ వేంకటేశ్వరస్వామివారు ప్రత్యక్షమై ”ఈ వయస్సులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు.. అడవిలో ఏం చేస్తున్నావు” అని ప్రశ్నించారు. యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే ఆలోచనతో ఉన్నాను అని వృద్ధుడు బదులిచ్చాడు. అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమచరించగా 19 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు. ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి ‘కుమార ధార’ అనే పేరు వచ్చింది.
 
పద్మ, వామన పురాణాల ప్రకారం దేవలోక సేనాధిపతి శ్రీ కుమారస్వామి రాక్షసుడైన తారకాసురిని సంహారం తరువాత శాపవిమోచనం కోసం ప్రయత్నించాడు. శివుని సూచన మేరకు శేషాచల పర్వాతాల్లోని వృషాద్రిలో తపస్సు చేశాడు. అనంతరం ఈ తీర్థంలో స్నానమాచరించి శాపవిమోచనం పొందాడు. సాక్షాత్తు శ్రీ కుమారస్వామివారు స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి ‘కుమారధార’ అనే పేరు స్థిరపడింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram