Sajjala Ramakrishna Reddy on Exit Polls | ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అని, జూన్ 4న ఓట్ల లెక్కింపు రోజున కుట్ర జరిగే అవకాశం ఉందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు, అక్రమాలు చేసైనా గెలిచేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తారని సజ్జల ఆరోపించారు. అందుకే వైసీపీ నేతలు, పోలింగ్ ఏజెంట్స్ కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూటమి నేతలు కుట్రలకు తెరతీసినా, ధైర్యంగా పోరాడాలి కానీ సంయమనం కోల్పోవద్దని సజ్జల వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు.జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి జూమ్ మీటింగ్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. రూల్స్ ప్రకారం వైసీపీకి పడిన ప్రతిఓటు మనకు వచ్చేలా చూడాలి. కౌంటింగ్ సమయంలో కూటమి నేతలు, కార్యకర్తలు కుట్రలకు వెనుకాడరు. అయినా సంయమనంగా ఉండి, ఏదైనా తప్పు జరిగినట్లు గుర్తిస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ కౌంటింగ్ కేంద్రంలో అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే కుట్రలు, అక్రమాలు చేసైనా కూటమి గెలుస్తుందని’ సజ్జల సంచలన ఆరోపణలు చేశారు.