Nellore: నెల్లూరులో రోడ్లపై చేపలు పడుతున్న వాహనదారులు..ఏంటీ వింత..?
నెల్లూరులో రోడ్లపై చేపలు పడుతున్నారు కొంతమంది. అటు ఇటు వెళ్లే వాహనాలను ఆపి మరీ చేపల వేట కొనసాగిస్తున్నారు. దీంతో వారు చేపలు పట్టుకునే వరకు వాహనదారులు అటు ఇటు ఆగిపోవాల్సి వస్తోంది. నెల్లూరు చెరువు కలుజు ప్రవాహంలో.. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో పొట్టేపాలం వద్ద ఈ పరిస్థితి ఉంది. నెల్లూరుకి నీరందించే స్వర్ణాల చెరువు కలుజు ప్రవాహం అక్కడ మొదలవుతుంది. చెరువు కలుజులోనుంచి పారుతున్న నీరు రోడ్డుపైనుంచి ప్రవహిస్తూ పెన్నా నదిలోకి వెళ్లి కలుస్తుంది. ఈ క్రమంలో అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని స్థానికులు పట్టుబడుతున్నా.. అధికారులు నేతలు, చప్టాతోనే సరిపెడుతున్నారు. భారీ వర్షాలకు చెరువులోనుంచి భారీగా నీరు బయటికొస్తోంది. దీంతో పెద్ద పెద్ద చేపలు సైతం ఆ నీటితోపాటు బయటికొచ్చేస్తున్నాయి. గేలం వేసి వేచి చూడాల్సిన అవసరం కూడా లేకపోవడంతో ఒకరిని చూసి ఒకరు చేపలు పట్టేందుకు ఉత్సాహం చూపించారు. దీంతో ఇదిగో ఇలా.. రోడ్డుపైనే చేపలు పడుతూ ట్రాఫిక్ కి అడ్డంగా నిలబడిపోతున్నారు.