Pemmasani Chandrashekar | ఎన్నికలకు ముందే దిల్లీ స్థాయిలో పని చేస్తానని హింట్ ఇచ్చిన పెమ్మసాని
ఏపీకి ఏదో చేయాలనే తపనతో గుంటూరుకు వచ్చానని..కానీ, తన విజన్ దేశం మొత్తానికి ఉపయోగపడేలా ఉంటుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఎన్నికల ముందే ABPతో దిల్లీ స్థాయిలో తాను పని చేయబోతున్నట్లు పరోక్షంగా చెప్పారు.
పెమ్మసాని తొలిసారి ఎంపీగా గెలవగానే కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కించుకొని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన ఆయన అనతికాలంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో వైద్యవిద్య లైసెన్సింగ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ‘యు వరల్డ్’ పేరుతో ఆన్‌లైన్ శిక్షణ సంస్థను ప్రారంభించి, స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ తర్వాత వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్‌లైన్ శిక్షణ ఇస్తూ అతికొద్దికాలంలోనే వేల కోట్ల రూపాయలకు ఎదిగింది.
అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం, ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఆయనను కేంద్రమంత్రి పదవికి చంద్రబాబు ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. క్యాబినెట్ ఎంపికలో తొలుత 10 స్థానాల కన్నా ఎక్కువచోట్ల గెలిచిన పార్టీలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నారని, ఈ నేపథ్యంలో టీడీపీకు తొలుత రెండు మంత్రి పదవులు ఇస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో మరో 2 మంత్రి పదవులు వస్తాయని తెలుగు దేశం వర్గాలు చెబుతున్నాయి.