Nellore Teachers Story on PRC: ఒకటో తేదీ జీతం పడకపోతే ఉద్యోగి ఆందోళన ఇలా ఉంటుంది..?
పెద్ద ఉద్యోగి అయినా, చిన్న ఉద్యోగి అయినా.. ఒకటో తేదీ జీతం కోసం ఎదురు చూస్తుంటారు. పెద్ద ఉద్యోగికి పెద్ద ఖర్చులుంటే, చిన్న ఉద్యోగికి చిన్న ఖర్చులుంటాయి. ఏపీలో సగటు ఉద్యోగికి పీఆర్సీ గొడవలో రెండో తేదీ అయినా జీతాలు పడలేదు. మరి వారి కష్టాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. నెల్లూరు నగరంలో నివశించే కృష్ణారెడ్డి, లక్ష్మీశ్వరి దంపతులు నగరం సమీపంలోని ముత్తుకూరు మండలంలో అప్పర్ ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయులు. వీరికి ఇద్దరు పిల్లలు. ఒకరు ఇంజినీరింగ్, మరొకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఉదయాన్నే టిఫిన్ చేసి, మధ్యాహ్నం లంచ్ కోసం వంట వండుకుని బాక్స్ ప్రిపేర్ చేసుకుని దంపతులిద్దరూ బైక్ పై స్కూల్ కి బయలుదేరుతారు. సాయంత్రం మళ్లీ బైక్ పై ఇంటికొస్తారు. ఇదీ వారి దినచర్య. పిల్లల స్కూల్, కాలేజీ ఫీజులతోపాటు సొంత ఇంటి ఈఎంఐ వీరికి అదనంగా ఉంది. ఇక కిరాణా సామాన్లు ఇతరత్రా ఖర్చులు సరే సరి. ప్రతి నెలా ఒకటో తేదీ జీతాలు పడితేనే తమకు వెసులుబాటు ఉంటుందని, గత కొంతకాలంగా జీతాలు ఆలస్యంగా పడుతున్నాయని, ఈ దఫా పీఆర్సీ గొడవ వల్ల అవి మరింత ఆలస్యం అయ్యాయని చెబుతున్నారు వీరిద్దరూ.