
Leopard in Tirupati SV University | వేంకటేశ్వర యూనివర్సిటీని వణికిస్తున్న చిరుతపులి | ABP Desam
తిరుపతిలో మూడు యూనివర్సిటీలను చిరుతపులి చుట్టేస్తోంది. శేషాచలం అడవులను ఆనుకుని ఉండే ఎస్వీ యూనివర్సిటీ, ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో చిరుత సంచారం విద్యార్థులను వణికిస్తోంది. రాత్రి పూట యూనివర్సిటీ పరిసరాల్లో తిరిగే జింకలు, దుప్పులు, కుక్కల కోసం చిరుతపులి వస్తున్నట్లుగా విద్యార్థులు చెబుతున్నారు. రాత్రి సమయాల్లో చిరుత తిరుగుతున్నప్పుడు కొంత మంది స్టూడెంట్స్ దాన్ని వీడియోలు కూడా తీశారు. అటవీశాఖ అధికారులు గతంలోనే రెండు బోన్లు ఏర్పాటు చేసినా చిక్కకుండా తిరుగుతున్న చిరుత అటు అధికారులను, ఇటు విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. గతంలోనే ఇలానే చిరుతల సంచారం విద్యార్థులను భయపెట్టింది. అప్పుడు కూడా జింకలపై, లేగ దూడలపై తన ప్రతాపం చూపిస్తూ వాటిని హతమార్చిన చిరుతను పట్టుకోవాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు.. ఫలితంగా అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు బోనులను ఏర్పాటు చేయటంతో చిరుత అటవీ మార్గంలోకి వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు యూనివర్సిటీల పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం మాత్రం స్టూడెంట్స్ లో గుబులు రేపుతోంది.