Gun fire in Chittoor Locals Rescue Operation | పోలీసుల వచ్చేలోపే గన్నులతో ఉన్న దొంగలను పట్టుకున్న స్థానికులు | ABP Desam

 చిత్తూరు గాంధీ రోడ్ లో కాల్పులు కలకలం రేపాయి. ఓ వ్యాపారిని బెదిరించేందుకు మరో వ్యాపారి దింపిన నార్త్ సుపారీ గ్యాంగ్ చేతిలో గన్నులు రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరుపుతూ నానా బీభత్సం సృష్టించింది.  లక్మీ థియేటర్ సమీపంలో ఉన్న పుష్ప కిడ్స్ వరల్డ్ షాపింగ్ మాల్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి ప్రెస్ అని స్టిక్కర్ వేసుకున్న వాహనంలో వచ్చిన ఆరుగురు చొరబడ్డారు. వారి చేతుల్లో గన్నులు కూడా ఉన్నాయి. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అయితే ఆరుగురిలో నలుగురు మాత్రమే చంద్రశేఖర్ ఇంట్లోకి వెళ్లగా ఇద్దరు మాత్రమే పక్కనే ఉన్న ఐడీబీఐ బ్యాంకులోకి వెళ్లారు. దీంతో బ్యాంకు దొంగతనానికి వచ్చారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే ఎస్ఎల్ వీ ఫర్నిచర్ యజమాని...పుష్ప కిడ్స్ షాపింగ్ మాల్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో దొంగతనానికి ముఠాను సెట్ చేసినట్లు తర్వాత తేలింది. 
అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఒకటి ఉంది. పుష్ప షాపింగ్ మాల్ ఓనర్ చంద్రశేఖర్ పై దొంగలు రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరపగానే బాగా దగ్గర ఉండటంతో ఆయనకు గాయాలయ్యాయి. రక్తం బయటకు వచ్చింది. దీంతో ఆయన పరుగును రోడ్డు మీదకు రాగా అక్కడి స్థానికులు అప్రమత్తమయ్యారు. బిల్డింగ్ పైకి ఎక్కి అక్కడ నుంచి వెనుక వైపునకు దూకి పారిపోదామనుకున్న దొంగలను స్థానికులు పట్టుకున్నారు. పోలీసులు వచ్చే లోపే ఆక్టోపస్ రేంజ్ లో ఆపరేషన్ చేపట్టారు. నలుగురు దొంగలను పట్టుకుని చితకబాదారు. వారి కాళ్లు చేతులు వెనక్కి కట్టేసి వాళ్ల చేతుల్లో నుంచి గన్నులు లాక్కున్నారు. తుపాకులు ఉన్నాయనే భయం కూడా లేకుండా స్థానికులు చేపట్టిన ఈ రెస్క్యూ ఆపరేషన్ పోలీసులను సైతం ఆశ్చర్యపరిచింది. వెంటనే రంగంలోకి దిగిన ఆక్టోపస్ బలగాలు ఆ ఏరియాను తమ ఆధీనంలోకి తీసుకుని నలుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన మరో ఇద్దరు దొంగల కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola