YS Viveka Murder: వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఇరికించాలని నాపై ఒత్తిడి ఉంది
ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసులో మరో సంచలన సంఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని ఇరికించేందుకు తనపై ఒత్తిడి తెస్తున్నారని గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి తెరపైకి వచ్చారు. కడప జిల్లా పులివెందుల కు చెందిన గంగాధర్ రెడ్డి గత కొన్ని ఏళ్లుగా యాడికి లో నివాసం ఉంటున్నాడు అయితే వైఎస్ వివేకా హత్య తర్వాత గంగాధర్ రెడ్డిని సీబీఐ అధికారులు అప్పట్లో సిట్ అధికారిగా ఉన్న సీఐ శ్రీరామ్ శంకర్ రెడ్డి హత్య చేయించినట్లు ఒప్పుకోమని తీవ్ర ఒత్తిడి తెచ్చారని డబ్బులు కూడా పెద్ద ఎత్తున ఆశ చూపారని అయినప్పటికీ తాను లొంగకపోతే చిత్రహింసలకు గురిచేశారని గంగాధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తాజాగా వైఎస్ వివేకా కూతురు సునీత తో పాటు మరికొందరు తనను తీవ్రంగా బెదిరిస్తున్నారని గంగాధర్ రెడ్డి బాంబు పేల్చారు. ఇదే అంశంపై ఇవాళ జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కు గంగాధర్ ఫిర్యాదు చేశారు. తనతో పాటు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి ని ఇరికించేందుకు సునీతతో పాటు కొందరు ప్రయత్నిస్తున్నారు అనేది గంగాధర్ ఆరోపణ. సిఐ శ్రీరామ్ తనపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి బెదిరింపులకు గురి చేశారని ప్రధానంగా గంగాధర్ ప్రస్తావించారు. దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ గంగాధర్ కు రక్షణ కల్పిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఈ అంశంపై విచారణకు డీఎస్పీ నియమించామని వారం రోజుల్లోగా పూర్తి చేస్తామని ఎస్పీ అంటున్నారు.