Llish Fist: వామ్మో... పులస చేప రూ. 50 వేలంటా...!
కేంద్రపాలిత ప్రాంతం యానాంలో సుమారు రెండు కేజీలకు పైగా బరువు ఉన్న గోదావరి పులసలు రెండు వలకు చిక్కాయి. అరుదుగా దొరికే ఈ పులసను సొంత చేసుకునేందుకు ఎంతోమంది ఎదురుచూస్తుంటారు. వరద ప్రవాహానికి ఎదురీదే పులస చేపలు సముద్రం నుంచి గోదావరి నదిలోకి వచ్చి సంతానాన్ని వృద్ధి చేసుకుసుకుంటుంది. ఈ ఏడాది ఇప్పటికే సగం పులసలు రావలసి ఉండగా ప్రస్తుతం వాటి జాడ అంతగా లేదు. ఇటీవల గోదావరి పులసల పేరుతో పలుచోట్ల ఒడిశా నుంచి వచ్చిన పులసల అమ్మకాలు జోరుగా సాగాయి. ప్రస్తుతం గోదావరిలో మత్స్యకారులు వేటకు వెళితే వారంలో ఒకటి లేదా రెండు చొప్పున పులసలు వలలో పడుతున్నాయి.
యానాం గౌతమీ గోదావరీ వద్ద ఉన్న మార్కెట్ లో గోదావరి సెనా పులస ఒకటి అమ్మకానికి వచ్చింది. రెండు కేజీల బరువు ఉన్న చేప రూ.20 వేలు పలికింది. తాజాగా మరో రెండు పులసలు మరింత రేటు పలికాయి. యానాం మార్కెట్ వద్దకు గోదావరి పులసలు రెండు రావడంతో పులస ప్రియులు కొనడానికి ఎగబడ్డారు. వీటిల్లో ఒకటి రూ.25 వేలు, మరొకటి రూ.23 వేల ధరకు అమ్ముడయ్యాయి. రెండు కేజీలకు పైగా బరువున్న చేపను కొల్లు నాగలక్ష్మీ రూ.23 వేలకు, మరో చేపను పట్టా భాగ్యలక్ష్మీ రూ.25 వేలకు సొంతం చేసుకున్నారు.