ఏపీ రాజధాని అమరావతి మాత్రమేనన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. విశాఖ, కర్నూలు నగరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటిని ఆకర్షణీయమైన నగరాలుగా తీర్చిదిద్దే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు..
చంద్రబాబుకు ఎంతో ఇష్టమైన రాష్ట్ర రాజధాని ప్రాంతం అమరావతి(Amaravati)లో కాకుండా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసరపల్లిని ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు ఏపీకి కొత్త రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆయన హయాంలోనే కొన్ని భవనాలు, కార్యాలయాలు కూడా ఇక్కడ ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు అక్కడ కాకుండా కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం చేయడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. వాస్తవానికి.. టీడీపీ నాయకులు.. తొలుత అమరావతి ప్రాంతంలోని మంగళగిరికి సమీపంలోనే ప్రమాణ స్వీకార వేదికను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అంతేకాదు.. ఈ నెల 9నే చంద్రబాబుప్రమాణ స్వీకారం చేస్తారని కూడా ప్రకటన చేశారు. కానీ, టైము, వేదిక రెండూ కూడా తర్వాత మారిపోయాయి.