Butchaiah Chowdary Oath Taking | ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన బుచ్చయ్య చౌదరి | ABP Desam

Continues below advertisement

ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య (Gorantla Butchaiah Chowdary) చౌదరి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో గురువారం ఆయనతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయన శుక్రవారం ప్రమాణస్వీకారం చేయించనున్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి ఈసారి ఎమ్మెల్యేగా గోరంట్ల ఎన్నికయ్యారు. టీడీపీ ఆవిర్భావం నుంచి రాజకీయాల్లో కొనసాగుతోన్న ఆయన ఇప్పటివరకూ ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీనియర్ శాసనసభ్యుడు కావడంతో ఆయనే ప్రొటెం స్పీకర్‌గా ఎంపికయ్యారు. ఈ నెల 21 (శుక్రవారం) నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 21, 22 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ఆంగ్ల అక్షరాల ప్రాతిపదికన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ఉంటుంది. అటు, స్పీకర్ పదవికి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram