బుడమేరు గండ్లు పూడ్చివేత పూర్తి, లీకేజ్ తగ్గించేందుకు అధికారుల యత్నం
బుడమేరు గండ్ల పూడ్చివేత పనులను పూర్తి చేసింది ప్రభుత్వం. ఇప్పుడే సీపేజ్ లీకేజ్ తగ్గుతూ వస్తోంది. పూర్తి స్థాయిలో ఈ లీకేజ్‌ని అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మంత్రి నిమ్మల రామానాయుడు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. మంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు లీకేజ్‌ని అడ్డుకునేందుకు ప్రత్యేక షీట్‌లు వినియోగిస్తున్నారు. అయితే..వస్తున్న వరదను అంచనా వేస్తూ గండ్లు పూడ్చిన చోట కట్ట ఎత్తు పెంచే పనులూ వేగవంతం అవుతున్నాయి. ఇప్పటికే గండ్లు పడిన చోట 5.7 మీటర్ల వరకూ ఎత్తు పెంచారు. ఇక వరద బాధితులకు అందుతున్న సాయంపైనా మంత్రి లోకేశ్ ఆరా తీస్తున్నారు. ఏ మేర నష్టం వాటిల్లిందో అంచనా వేయడంపైనా దృష్టి పెట్టారు. ఇప్పుడిప్పుడే కాస్త వరద ఉద్ధృతి తగ్గుతుండడం వల్ల అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. గండ్లు కూడా పూడ్చివేయడంతో ముప్పు తప్పిందని భావిస్తున్నారు. సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలపై ఆరా తీస్తున్నారు.