పుస్తక ప్రియులను ఆకట్టుకుంటున్న పుస్తక హుండీ...
విజయవాడ లోని సర్వోత్తమ భవన్లో గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి ఏర్పాటు చేసిన ఉచిత పుస్తక పంపిణీ కార్యక్రమానికి పుస్తక ప్రియుల నుంచి మంచి ఆదరణ లభించింది. ప్రతి ఏటా మూడు రోజుల పాటు గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, పుస్తక ప్రియులు మాట్లాడుతూ...పేదలు, మధ్యతరగతి విద్యార్థులు పుస్తకాలు కొనుగోలు చేసుకోలేక ఇబ్బందులు పడుతుంటారని అటువంటి వారికి ఈ ప్రదర్శన ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో...ఓ మంచి పుస్తకం కొనుక్కో ..అన్న కందుకూరి మాటలను స్పూర్తిగా తీసుకొని పుస్తక పఠనం అలవాటుచేసుకున్నామన్నారు. సాహిత్యం, విద్య, సాంకేతిక, ఇతర అనేక రంగాలకు సంబంధించిన పుస్తకాలన్నీ ఒకేచోట చేర్చడంతోపాటు ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ శాఖ కార్యదర్శి రావి శారద మాట్లాడుతూ... జీవన ప్రమాణాల పెంపునకు పుస్తక పఠనం మార్గమన్నారు. ప్రతి ఏటా నిర్వహించే ఉచిత పుస్తక పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. పుస్తకాల పంపిణీతో పుస్తకాల హుండీ ఏర్పాటు చేసి దాతల నుంచి పుస్తకాలను సేకరిస్తున్నామని వివరించారు.