గుంటనక్క తోడేలు కథ హిట్, శ్యామలకు వైసీపీలో కీలక పదవి
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక YSRCPలో వలసలు మొదలయ్యాయి. కొంత మంది మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. ఇప్పటికే కాకినాడ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ క్రమంలోనే హైకమాండ్ పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కీలక పదవులు ఇస్తోంది. అంతే కాదు. తమ పార్టీ తరపున ప్రచారం చేసిన వారికీ మంచి పదవులు కట్టబెడుతోంది. మాజీ మంత్రి ఆర్‌కే రోజా, జూపూడి ప్రభాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఈ లిస్ట్‌లో యాంకర్ ఆరె శ్యామల కూడా ఉండడం ఆసక్తికరంగా మారింది. నారా లోకేశ్ నియోజకవర్గమైన మంగళగిరిలో YSRCP తరపున విస్తృతంగా ప్రచారం చేశారు శ్యామల. ఇప్పుడు ఆమెకి పార్టీ అధికార ప్రతినిధిగా హోదా లభించింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేస్తూ అప్పట్లో గుంటనక్క తోడేలు కథ చెప్పారు శ్యామల. ఈ స్టోరీపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. అదే సమయంలో ఫేమస్ కూడా అయ్యారు. మొత్తానికి ఆ కథ ఆమె పొలిటికల్ జర్నీకి ఉపయోగపడిందని కొంత మంది కామెంట్ చేస్తున్నారు.