Will KCR Go Early Polls :   మునుగోడు  ఉపఎన్నికల ఫలితం టీఆర్ఎస్‌కు బూస్ట్‌ ఇచ్చింది. సీఎం కేసీఆర్‌కు ఇది అత్యంత క్లిష్టమైన సమయంలో వచ్చిన విజయం అనుకోవచ్చు. తెలంగాణలో ఎనిమిదేళ్లలో ఊహించనంత అభివృద్ధి సాధించినా..రాజకీయ కారణాలతో వచ్చిన ప్రజా వ్యతిరేకతను అధిగమించడానికి కేసీఆర్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మునుగోడు ఉపఎన్నికల రూపంలో బీజేపీనే ఓ అవకాశం ఇచ్చింది. ఈ టెస్టులో టీఆర్ఎస్‌ను పాస్ చేసేశారు  కేసీఆర్. తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అని మరోసారి ఆ పార్టీ హోరెత్తించే అవకాశం మునుగోడు ఫలితంతో వచ్చింది.  ఇప్పుడు కేసీఆర్ ఈ ఊపును ఎలా ఉపయోగించుకుంటారు ? ముందస్తు ఎన్నికలకు వెళ్తారా ? ఈ జోరును కొనసాగిస్తారా ?


మునుగోడు ఫలితంతో టీఆర్ఎస్‌లో జోష్ !


కొంత కాలంగా టీఆర్ఎస్ ఆత్మరక్షణ ధోరణిలో ఉంది.  ప్రభుత్వంపై వ్యతిరేకత  ఎక్కువగా ఉందన్న విశ్లేషణలే దానికి కారణం. అయితే ఇష్టం లేకపోయినా వచ్చిన మునుగోడులో తాడే పేడో అన్నట్లుగా పోరాడి విజయం సాధించడంతో ఇప్పుడు గతంలో లేనంత పాజిటివ్ నెస్ కనిపిస్తోంది. టీఆర్ఎస్ శ్రేణుల్లోనూ ఈ ఉత్సాహం కనిపిస్తోంది. మూడో సారి కూడా ఎదురు లేదన్న నమ్మకానికి వచ్చారు. దీంతో ఇప్పటి వరకూ ఆత్మరక్షణలో ఉన్న వారు ఇప్పుడు సై అంటే సై అనే స్థాయిలో ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకుంటున్నారు. ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధమే అన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. మరి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారా ?


ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ ఆలోచన చేస్తారా ?


తెలంగాణలో ఏడాదిగా ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతోంది. కానీ కేసీఆర్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెబుతూ వస్తున్నారు. ఇటీవల టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చుతూ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ముందస్తు ఎన్నికల ముచ్చటే లేదు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. ఫామ్ హౌస్ ఫైల్స్ బయటపెట్టిన తర్వాత కేసీఆర్ ఆలోచన మారిందని అంటున్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో గెలుపు రావడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన పాజిటివ్ వైబ్రేషన్స్‌ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం మంచిదని భావిస్తున్నారు. ప్రధాన  ప్రత్యర్థిగా ఎదిగిన బీజేపీని కార్నర్ చేయడానికి..  ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని అడ్డగోలుగా పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నించిందని ఆధారాలు చూపించడం ద్వారా ఓ ఆయుధం కేసీఆర్ వద్ద ఉంది. ఇలాంటి ఆయుధం ఉంటే కేసీఆర్ ఎలా సెంటిమెంట్ పండించగలరో రాజకీయ ప్రత్యర్థులకు బాగా తెలుసు. అందుకే అంది వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారనే ఎక్కువ మంది నమ్ముతున్నారు. 


మరో ఏడాదిలో ఎన్నికలు.. ముందస్తుకెళ్తే మరో ఆరు నెలల్లోనే !


తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పూర్తి స్థాయిలో పదవిలో ఉండలేదు. ఆరు నెలల ముందుగానే ముందస్తుకెళ్లారు. విజయం సాధించారు. ఇప్పుడు మరో ఆరు నెలల ముందు ముందస్తుకు వెళ్లవచ్చు. ఎందుకంటే .. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉంది. ఇప్పుడు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నా.. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. కే్సీఆర్ జాతీయ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలనుకుంటున్నారు. తెలంగాణలో మూడో సారి గెలిస్తే.. ఆ ప్రభావం దేశం మొత్తం ఉంటుంది. ఉత్తరాదిలో కూడా ఆయనకు కీలకమైన నేతగా గుర్తింపు లభిస్తుంది. ఆ తర్వాత టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా ప్రజల్లోకి తీసుకెళ్లడానిక అవకాశం ఉంటుంది. లోక్ సభ ఎన్నికల్లోనూ అడ్వాంటేజ్ సాధించవచ్చు. ఈ దిశగా కేసీఆర్ ఆలోచలన ఉండవని కొట్టి పారేయలేం. అందుకే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావొచ్చన్న అభిప్రాయం ఎక్కువగానే వినిపిస్తోంది.