Wearing Tie History: మెడకు రంగురంగుల టై కట్టుకోవడం చాలా మంది గమనించే ఉంటారు. సినిమాల్లో, టీవీ షోలలో, ఎక్కడైనా ఉన్నతాధికారులు, కార్బొరేట్ వ్యాపారులు కనిపించినప్పుడు వారి మెడలో రంగురంగుల టైలు కనిపిస్తాయి. అలాగే మెడికల్ రిప్రజెంటేటివ్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లు, ఇతరులు కూడా తమ వృత్తిలో భాగంగా టైలు కట్టుకుంటారు. చిన్నప్పుడు స్కూళ్లలో టైలు కట్టుకున్న అనుభవం చాలా మందికి ఉండే ఉంటుంది. అసలు ఈ టైలు ఎందుకు కట్టుకుంటారు.. టైలు కట్టుకోవడం ఎలా మొదలైంది.. దీని వెనక ఉన్న చరిత్ర ఏమిటి.. మతాల మధ్య యుద్ధానికి టైలకు సంబంధం ఏంటో తెలుసుకుందాం.


అలా మొదలైన టై ఫ్యాషన్


నెక్ టైలు ఫ్యాషన్ లో ఓ భాగం. నిజానికి ఇది ఇటీవల ప్రారంభమైన ఫ్యాషనేం కాదు. 17వ శతాబ్దంలోనే టైలను ఉపయోగించే వారు. మొదట క్రొయేషియన్ సైనికులు టైలు ధరించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ సైనికులు తమ గొంతును చలి నుంచి రక్షించుకోవడానికి మెడలో పొడవాటి కండువా కట్టుకునే వారు. క్రొయేషియన్లతో కలిసి యుద్ధంలో పోరాటం చేసినప్పుడు వారు కట్టుకున్న టైలను చూసి ఫ్రెంచ్ వారు ముచ్చటపడ్డారు. క్రొయేషిన్ సైనికులు చేసిన సాయానికి గుర్తింపుగా అప్పటి ఫ్రెంచ్ రాజు తన ఆస్థానంలో కండువాలు కట్టుకోవడాన్ని ప్రవేశపెట్టారు. అలా ఫ్రెంచ్ పౌరులు కూడా టైలు కట్టుకోవడం మొదలు పెట్టారు. అలా టైలకు ఆధరణ క్రమంగా పెరిగింది. 


నెక్ టై - థర్టీ ఇయర్స్ వార్


థర్టీ ఇయర్స్ వార్.. 1618 నుంచి 1648 వరకు అంటే ముప్పై సంవత్సరాల పాటు ఐరోపాలో జరిగిన మతపరమైన యుద్ధాన్ని థర్టీ ఇయర్స్ వార్ అని పిలుస్తుంటారు. ఈ యుద్ధం కాథలిక్, ప్రొటెస్టెంట్ దళాల మధ్య జరిగింది. ఇది ఐరోపా చరిత్రలో అత్యంత విధ్వంసకర సంఘర్షణల్లో ఒకటిగా నిలిచి పోయింది. ఈ యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు చరిత్ర చెబుతోంది. అలాగే ఈ యుద్ధం వల్ల దేశం మొత్తం నాశనం అయిపోయింది. ఈ యుద్ధంలో భాగంగా కొందరు సైనికులు టైలు కట్టుకుని యుద్ధంలో పాల్గొనే వారు. వారి నుంచి ఇతర సైనికులు కూడా దీనిని పాటించడం మొదలు పెట్టారు.


మోడ్రన్ టైమ్స్ లో నెక్ టై


యుద్ధం నుంచి ఉద్భవించిన టై.. ఆ తర్వాత చాలా మార్పులకు లోనై ప్రస్తుతం ఉన్న రూపంలోకి వచ్చింది. ఇప్పుడు వృత్తి నిపుణులు, కార్పొరేట్ వ్యాపారాలు, అధికారం యొక్క చిహ్నంగా టైను ధరిస్తున్నారు. వివిధ దేశాల్లోని రాజకీయ నాయకులు కూడా నెక్ టైలు ధరిస్తూ కనిపిస్తారు. అలాగే ఏదైనా అధికారిక మీటింగ్ లు, సమావేశాలు, ఇంటర్వ్యూలు జరిగినప్పుడు సూట్ వేసుకుని టై కట్టుకోవడం ఫ్యాషన్ యాక్సెసరీగా మారిపోయింది. ప్రస్తుతం మార్కెట్ లో చాలా రకాల టైలు అందుబాటులో ఉన్నాయి. టై రంగును బట్టి వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేస్తుంటారు.


సూట్ లు ధరించే వారు చాలా మంది టైలు కట్టుకోవడానికి ఇష్టం చూపిస్తుంటారు. ఫార్మల్ లుక్ లో కనిపించడానికి టైలు అత్యుత్తమైన యాక్సెసరీ అని ఫ్యాషన్ నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు. మారుతున్న ఫ్యాషన్ పోకడలకు అనుగుణంగా ఈ టైలు మరింతగా మార్పులకు లోనై ఇంకేలా కనిపించనున్నాయో చూడాలి. రక్తపుటేరులు పారే యుద్ధం నుంచి ఉద్భవించిన టై.. ఇప్పుడు ఫ్యాషన్ ఐకాన్ గా, దర్పానికి సింబల్ గా మారిపోయింది.